17, సెప్టెంబర్ 2017, ఆదివారం

Rohingyas of Myanmar


దిక్కు దివాణం లేని పక్షులు మియన్మార్ రోహింగ్యాలు అవసరం కోసం వేరే దేశం అడిగితే వెళ్లి బాగుపడదామనుకుని చెడిన జాతి మానవ చరిత్రలో రోహింగ్యా ముస్లిం తెగది. వీరి మూలాలు ఇప్పటి బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ ప్రాంతంలో ఉన్నాయి. క్రీస్తుశకం 1430 ప్రాంతంలో ఇప్పటి మియన్మార్, అప్పటి బర్మా పశ్చిమ సరిహద్దులోని అరకాన్ రాజ్యాన్ని బౌద్దరాజు నరమీఖ్లా పరిపాలిస్తున్న రోజులవి. భారత్ లో మొగల్ చక్రవర్తుల మాదిరిగా తాన రాజ్యాన్నీ, పాలననూ తీర్చిదిద్దుకోవాలన్న ఊహతో ఆయన చిట్టగాంగ్ ప్రాంతంలోని రోహింగ్యా ముస్లిములను ఆహ్వానింటి, కొలువులోనూ సైన్యంలోనూ పెద్ద పదవులు, మొగలాయి బిరుదులూ ఇచ్చి పెట్టుకున్నాడు. దాదాపు 350 ఏళ్లు ఆరకాన్‌కు రోహింగ్యాల వలసలు పెరిగాయి. 1785లో పరిస్ధితి తల్లకిందులైంది. దక్షిణ బర్మా నుంచి బౌద్ధులు దండెత్తి అరకాన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పదవుల్లో ఉన్న రోహింగ్యా ముస్లిం పెద్దలను వారు వెళ్లగొట్టురు. దాదాపు 35 వేలమంది రోహింగ్యాలు అప్పట్లో బ్రిటిష్ ఏలుబడిలోని బెంగాల్‌కు పారిపోయారు. మరో 80 ఏళ్లకు అరకాన్‌లో రోహింగ్యాలకు మంచిరోజులు వచ్చాయి. 1824-1826 మొదటి ఆంగ్లో-బర్మీస్ యుద్ధంలో బ్రిటిష్ వాళ్లు అరకాన్ ను చేజిక్కించుకున్నారు. జనాభా తగ్గిపోయిన అరకాన్ ప్రాంతానికి బెంగాల్ రైతులు వలసవచ్చేందుకు బ్రిటిష్ వాళ్లు ప్రోత్సహించారు. అవకాశం చేజిక్కించుకున్న రోహింగ్యాలు పెద్ద ఎత్తున అరకాన్ ప్రాంతానికి వచ్చిచేరాను. ఈ ఆకస్మిక పరిణామానికి అరకాన్‌లోని స్థానిక రఖీనే బౌద్ధులు అసంతృప్తితో భగ్గుమన్నారు. వారికి బెంగాల్ నుంచి వచ్చిన రోహింగ్యా ముస్లిములకు గొడవలు మొదలయ్యాయి. ఆ జాతివైరం ఈనాటికీ రావణకాష్ఠంలా రగులుతూనే ఉంది. రెండో ప్రపంచయుద్ధం ప్రారంభంలో దక్షిణ ఆసియాలో జపనీయుల విస్తరించసాగారు. బ్రిటిష్ వాళ్లు అరకాన్‌ను వదులుకున్నారు. ఈ గందరగోళంలో రఖీనే బౌద్ధులు, రోహింగ్యా ముస్లిములు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడి, ఊచకోత కోసుకున్నారు. అప్పటికీ బ్రిటిష్ వాళ్లపై ఆశ వదులుకోని రోహింగ్యాలు సంకీర్ణ సేనలకు అనుకూలంగా జపాన్ వారిపై గూఢచర్యం చేశారు. ఇది పసిగట్టిన జపనీయులు రోహింగ్యాలను చిత్రహింసలు పెట్టి, వారి మహిళలను మానభంగం చేశారు. దానితో వేలమంది రోహింగ్యాలు బెంగాల్‌కు పారిపోయారు. రెండో ప్రపంచ యుద్ధం 1945లో ముగిసిన నాటి నుంచి, 1962లో జనరల్ నె విన్ సైనిక తిరుగుబాటుతో అధికారాన్ని హస్తగతం చేసుకునే వరకు అరకాన్‌లోని రోహింగ్యాలు తమకు ప్రత్యేక దేశం కావలని పోరాటం సాగించారు. అయితే సైనిక ప్రభుత్వం ఏర్పడ్డాక, వేర్పాటువాదులా,కాదా అని చూడకుండా మొత్తం రోహింగ్యాలపై అణచివేత మొదలైంది. రోహింగ్యాలకు కనీసం బర్మా పౌరసత్వం కూడా ఇవ్వకుండా, దిక్కూ మొక్కూలేని బెంగాలీలుగా ముద్రవేసింది. నాటినుంచి మియన్మార్‌లోని రోహింగ్యాలకు గడ్డు పరిస్ధితే. ప్రభుత్వ దళాలు, చాలాసార్లు బౌద్ధ సన్యాసులు కూడా వారిపై దాడి చేశారు. సముద్రంలో పడి పారిపోయే వేలాదిమంది రోహింగ్యాలను మలేసియా, ఇండోనేషియా వంటి ముస్లిం దేశాలూతలదాచుకోనివ్వడం లేదు. కొందర్ని ధాయ్‌లాండ్‌లోకి చేరనిచ్చినా వ్యభిచారానికి వాడుకుంటున్నారు. ధాయ్‌లాండ్ సైమ్యం కూడా చాలామందిని తిరిగి సముద్రం పాలే చేస్తోంది. ఆస్ట్రేలియా అసలు దగ్గరికే రానివ్వడం లేదు. ఫిలిప్పైన్స్ మాత్రం 2015 మేలో పడవల్లో వచ్చిన 3వేలమంద రోహింగ్యాలకు తలదాచుకునే శిబిరాలు ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. ఐక్యరాజ్యసమితి శరణార్ధుల హైకమిషన్ (UNHCR), ఫిలిప్పైన్న్ ప్రభుత్వం కలిసి వారికి తాత్కాలిక శిబిరాలు ఇచ్చి కనీస అవసరాలు చూస్తున్నప్పటికీ ఇంకా వేలమంది రోహింగ్యాలు సముద్రాలు పట్టుకుని దారీ తెన్నూలేక అలమటిస్తున్నారు. మియన్మార్‌లో 8 లక్షలనుంచి 13 లక్షల మంది రోహింగ్యా ముస్లిములు ఉంటారని అంచనా. కొన్నేళ్లుగా మరో 11 లక్షలమంది ఇప్పటికే ప్రాణాలు అరచేతబట్టుకుని వేరే దేశాలకు పారిపోయారు. సౌదీ అరేబియాలో సుమారు 4 లక్షలమంది. బంగ్లాదేశ్‌లో 5 లక్షలమంది రోహింగ్యాలు ఉంటారు. అలాగే భారత్, ధాయ్‌లాండ్, మలేసియా, నేపాల్, అమెరికాలకు కొన్నివేలమంది రోహింగ్యాలు వెళ్లిపోయారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి